Monday, November 14, 2022

Aaku Raalina Chappudu Coverage Guntur

 Prajasakthi



Visalandhra




Eenadu







Surya




Sakshi




AndhraJyothy

Aaku Raalina Chappudu Book Invitation Guntur




‘ఆకురాలిన చప్పుడు’ కవిత్వం(ఆంధ్రజ్యోతి వివిధ)

శ్రీ వశిష్ఠ సోమేపల్లి కవిత్వ సంపుటి ‘ఆకురాలిన చప్పుడు’ ఆవిష్కరణ సభ నవంబరు 13 ఉ.10గం.లకు ఎ.పి. కాటన్‌ అసోసియేషన్‌ మీటింగ్‌ హాల్‌, లక్ష్మిపురం మెయిన్‌రోడ్‌, గుంటూరులో జరుగుతుంది. పెనుగొండ లక్ష్మీనారాయణ, పాపినేని శివశంకర్‌ తదితరులు పాల్గొంటారు.

చలపాక ప్రకాష్‌




Aaku Raalina Chappudu Book

Aaku Raalina Chappudu by Sree Vasista Somepalli is available at Amazon.



COLLECTION OF POEMS WRITTEN BY YOUNG POET, SREE VASISTA SOMEPALLI.
శ్రీ వశిష్ఠ సోమేపల్లి రచించిన ఆకురాలిన చప్పుడు కవితా సంపుటి. 







Monday, July 22, 2019

పాటంటే మాటలా...


పాటంటే మాటలా…!

నిజానికి కర్ణభేరి పై తాళం వేయటం వరకే ఈ పాటల పని!
కానీ దాహంగా ఉందేమో
నా తడి హృదయాన్ని తాగటానికి
లోపలికి వచ్చేసిందా పాట...

వచ్చి ఊరుకోకుండా గిటార్ తీగలను లాగినట్టు
ఎదనల్లుకున్న జ్ఞాపకాల లతల్ని మీటుతోంది..
అదలా లాగి వదులుతుంటే
తీపిగా తరంగాలు ఎగిరి బరువులై
మనసుని లోతుల్లోకి జార్చి జార్చి
నిద్రపోతున్న మడుగులో బొట్టుగా పడేశాయి..

అంతే!
కొలను కడలై జ్ఞాపకాల అలలు రేగాయి
అప్పటి నువ్వుని ఓ సారి చూడూ అంటూ
ఓ కెరటం మది పాదాల్ని నిమిరింది
అటు చూసే లోపు
అప్పటి కలల్నీ ఓ సారి చూడమంటూ మరో అల నవ్వింది-
మనుషులే కాదు స్వప్నాలు మారిపోతాయి అన్నట్టు

పాత కలే కదా ఓ ముద్దు పెడదాం
అని హత్తుకోబోతుంటే..
ఎన్నో మరెన్నో అలలు
ఓ సారి ఎత్తుకోమంటూ ఎగిసి వస్తున్నాయి!

చిన్న బిందువే కదా అనుకుంటే
సంద్రమంత లోతుకు లాక్కెళ్ళింది..
అణువంత చెమ్మ అనుకుంటే
ఈదలేని ఊటై మింగేస్తోంది..
అందుకే చెవిలోంచి ఇయర్ ఫోన్ తీసేశాను అర్థాంతరంగా

కానీ అప్పటికే మునిగేశానాయే!
నా మనసుతడి తాగటానికి వచ్చిన ఓ గేయం
గురుతుల్ని పొడిచి పొడిచి మరింత తడి చేసి వెళ్ళిపోయింది

అందుకే
కొన్ని పాటలు ఎప్పటికీ పూర్తిగా వినలేను


కలల హంతకులు

కలల హంతకులు



కొత్త చిగురుకు సొంత కలలా!
ధడేల్
కిటికీలు మూసేసారు
కలల గాలుల స్వరాలు
ఆ చెవులకు కీచు శబ్ధాలయ్యాయేమో!?

ఐనా ఆ స్వరాలు చొచ్చుకొచ్చాయి
పగుళ్లు సందులను సున్నితంగా తాకుతూ..
కానీ వాళ్లకు వికృత అస్వస్థ శబ్ధాలుగా
తాకాయా కలలు
అచ్చం
వయోలిన్ ను  రంపంలా కోస్తున్నట్టు

ఈ కలలను ఆపేదెలా?
కిటికీ తీసేస్తే పోలా!
సంతృప్తిగా నవ్వుతూ..
ఓ కలల హంతకుడు పుట్టాడు

ఇక ఈ ఎయిర్ టైట్ గదిలోనే
ఆ చిగురు మానయ్యేది
స్వేచ్ఛా కలలు వీచవు
అన్ని కలలూ ఏసీనే నిర్దేశిస్తుంది
రిమోట్ హంతకుని చేతిలో..

తమవి కాని కలల్ని చంపేసే ఫాసిస్టును,
మరో కలల హంతకున్ని తయారు చేసే ఓ
వికృత ప్రక్రియ ఇది.
ఎంత హింస! ఎవరికీ కనిపించదా?
కలల హంతకుల లోకంలో హత్య ఒప్పేనా..!
కలమేధాలు ఎంత నిత్యమైతే మాత్రం
కాలం సత్యమే అని అంటుందా..!?

ఓ వైపు
ఆ చిగురు..
ఇనుప కమ్మీలు లేని స్వేచ్ఛా సమాజంలో
రెక్కలు విరిగిన చిలుకై నడుస్తూ..
రెక్కలు విప్పార్చలేని బతుకెందుకని
కిటికీని కప్పిన గోడకేసి
తల బాదుకుంటుంది..

మరో వైపు
తన స్వప్నాలు భారంగా ఉరిమి
కన్నీరై కురిసి నానుస్తున్నాయి ఆ గోడను

ఇక ఖశ్చితంగా పగలాల్సిందే..
తలో..గోడో..!

Tuesday, February 12, 2019

కంచెలు దాటుకుంటూ...

కంచెలు దాటుకుంటూ...

కవిత




కంచె తెగింది
వికసిస్తున్న సామ్యవాద సంకేతం కాదిది
కొండల్లో..అడవంచున..దూరంగా వున్న
పోడు మనుషులను కబళిస్తున్న పెట్టుబడి సామ్రాజ్యం

పాపం వాళ్ళకేం తెలుసని
పాదు తీసి దుంపల్ని గుప్పెట్లోకి తీసుకోవటం
పోడుతో పంటని పండించటం తప్ప
అమ్మని కౌగిలించుకున్నట్టు కొండను వాటేసుకుని పడుకునే గిరిపుత్రులు వాళ్ళు
నిన్నూ నన్నూ కూడా
ఓ చెట్టునో పుట్టనో పలకరించినట్టు ఆత్మీయంగా హత్తుకునే నిజమైన మనుషులు

అసలు వాళ్ళకేం తెలుసు ఈ వాదాలు..
తెలిసిందల్లా ఒక్కటే
చెమటతో కడుపు
ప్రేమతో మనసుని నింపుకునే మార్గాలే
అమ్మకడుపులో ఉన్నది మట్టిగడ్డ కాదు ఖనిజపు దిబ్బంటూ
విరిగిన కర్రలు వీపుపై పొమ్మని రాస్తుంటే ఎక్కడికని పోతారు
సొంత తల్లి ఒడిలోనే కంబారీలయ్యారు..
అయినా అడవి ఆత్మీయత గాలులు పీలుస్తున్నామనే ఆశతో వెలుగే మిణుగురులు

వేర్ల గుప్పెట్లోని మట్టి ముద్ద ఎప్పుడన్నా లావా చిమ్మిందా?
వేళ్ళు గొంతుల్ని నలిపేస్తుంటే నిప్పు కణికల్లానే చెట్లలో కారతారు
అందుకే
చేను గట్టున అస్తమించిన సూర్యుడు అడవిలో ఉదయిస్తాడు
మరో తెల్లవారు ఝామున తెగిన పట్టాలై ఎదురొస్తాడు
గుండెను గుద్ది రక్తాన్ని చిమ్మించే రాయి ఇప్పుడు నిప్పును రాజేస్తుంది
రాయిని రాయి తాకినట్టు
గుండె బండయ్యిందని విసిరే చేతికి చెప్పకు
ఏ ఘనంలో ఏ గని ఉందోనని గుండె కోసి వెతుకుతారు

అణిచే కాళ్ళకు గుండెలు కార్చే ఎరుపే ఇష్టం
అదే అరుణం చొక్కాలై తిరిగితే
తుపాకీలు అడవిని దువ్వుతాయి
ఒక్కో రాయినీ తూటాలతో పగలకొట్టి నెత్తురు నేలకు రాస్తాయి
ఏదైతేనేం పేలు ఏరేశాం
అనుకుంటూ ఈ సారి దున్నటానికి
యంత్రాలు సిద్ధం చేసుకుంటాయా కృష్ణబిలాలు
మింగే నోళ్ళకు తెలీదు
ఓ తడికోసం ఎదురుచూస్తున్న ఎముకల విత్తులు
నేలింకించుకున్న రక్తాన్ని పీల్చుకుని మరో మొక్కగా అడవిలో కలుస్తాయని
తనలో మరో మొక్కని కలుపుకుని అరణ్యం అలై పోటెత్తుతుందని

అందుకే నరికేయాలి
ఇప్పుడు కాదు
రాళ్ళు తగలకముందే
కంచె తెగకముందే
అడవి గుండెలో తుపాకీ విత్తుగా మొలవకముందే
కబళిస్తున్న సామ్రాజ్యవాద వూసుల్ని నరికేయాలి
అణుస్తున్న ఫాసిస్టు ఆలోచనలను నరికేయాలి

చెట్టుకు పూసిన ఎండు మొలకల్లాంటి పిట్ట గూట్లో
ఫ్రీ కానుకలు పెట్టనవసరం లేదు
కొమ్మని కొట్టకుండా వుంటే చాలు
సామ్యానికి సామాన్యుడికి మధ్య కంచెలు దాటుకుంటూ వంతెన లేకపోతే
అడవి ఆకులు ఎర్రగానే మండేది

కొంచెం నీరు పోయాలి..
ఆకులపై జల్లితే సెగలే కక్కుతాయి
వేర్లని తడిపితే హరిత శోభితమౌతాయి
- శ్రీ వశిష్ట సోమేపల్లి - 9966460536
(ఫిబ్రవరి 2019 సాహిత్య ప్రస్థానంలో ప్రచురితం)

Thursday, December 20, 2018

సిద్దార్థ కట్టా "ఒక" దీపం

సిద్దార్థ కట్టా "ఒక" దీపం


సిద్దార్థ కట్టా. తను ఓ కవి అని నాకు తెలిసింది కొన్ని నెలల క్రితం మాత్రమే. అంతకుముందు దాకా ఇంటర్మీడియట్ అనంతర తమ తమ జీవితాల్లో తప్పిపోతున్న ఎందరో మిత్రుల్లో అతనొకడు.  కవిత్వాన్ని నేర్పే కవిసంగమమే మళ్ళీ సిద్దార్థను చూపించి నాకో కవిమిత్రుడినిచ్చింది.
ఆ తర్వాత కలవటం, "ఒక" పుస్తకం తీసుకోవటం, రెండ్రోజుల్లో చదవటం అయిపోయింది.
నిజానికి నేను అప్పుడప్పుడే కవిత్వం చదువుతున్న రోజులవి. అప్పట్లో సిద్దార్థ కవిత్వం చాలా వరకు అర్థం కాలేదు. కానీ అర్థం అయినవి మాత్రం ఇప్పటికీ నన్ను వదల్లేదు. మళ్ళీ చదివాను, మళ్ళీ మళ్ళీ చదివాను. చదివిన ప్రతిసారి కొత్త అనుభూతులు ఆస్వాదిస్తున్నాను.
ఈ ఒక  చదువుతున్నంత సేపూ ఎలా వుంటుందంటే.. కొన్ని పేజీలు తిప్పుతుంటే చేతికి నెత్తుటి జీర అంటుకుంటుంది, కొన్ని పేజీల్లో చిన్ని పాప కోరికలు వినిపిస్తాయి, ఇంకొన్ని పేజీలు తడిగా తగులుతూ.. ఇవి మనుషుల హృదయాల్లోని సముద్రాలని చెప్తాయి.
అంతేనా..!
బాల్కనీ బుగ్గపై వాలిన మల్లెచెట్టు గుబాలింపులూ..
పాపాయి ఏడుపుకు తలతిప్పే మనుషుల హృదయాలూ..
ప్లాస్టిక్ పూలు కోరుకునే పాప మనసూ..
పుస్తకం మూసేసినా కూడా వెంటాడుతాయి
ఈ సిద్దార్థ "ఒక" తన కళ్ళద్దాలు.. అవి మనకిస్తాడు. నిరంకుశ లాఠీలని చూపిస్తాడు, నిలదీతల్ని వినిపిస్తాడు, తన సిద్ధాంతాన్ని చదవమని, వెలగమని చెప్తాడు..
అలాగే ఓ కవితలో ఇలా చెప్తాడు..
"కాలం ఎవరో వెలిగించిన దీపపు ప్రమిద
మనిషి వెలుతురు చుట్టూ తిరిగే రెక్కల పురుగు" అని.
ఆ వెలుతురును చిమ్మే ఓ దీపమే ఈ ఒక అని అంటాన్నేను.

-శ్రీ వశిష్ఠ సోమేపల్లి